ఆదర్శనగర్ గణపతి ఉత్సవాల మహోత్సవం అలరించిన సంగీత విభావరి
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద సంగీత విభావరి నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాకారులు భక్తి గీతాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు. కాలనీ వాసులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సంగీత కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.
భక్తి గీతాలు, కీర్తనలతో మండపం పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు ప్రతి సంవత్సరం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉపన్యాసాలతో పాటు భక్తులను ఆకట్టుకునే వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు.
అందులో భాగంగానే ఈ ఏడాది సంగీత విభావరి నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాలనీ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.