లాలాపురంలో సోఫోన్ ఫంగిసైడ్ నూతన ఉత్పత్తి ఆవిష్కరణ
మిర్చి పంటలో ఫీల్డ్ డెమో ద్వారా రైతులకు ప్రత్యక్ష అవగాహన
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామంలో ఎండోఫీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు చెందిన సోఫోన్ (SOPHON) ఫంగిసైడ్ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించారు. మండల వ్యవసాయ అధికారి దొడ్డిగల్ల బాలాజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు షేక్ సర్దార్‌మియా మిర్చి పంట పొలంలో అలెక్టో, క్యూబికో ఉత్పత్తుల వినియోగంపై ఫీల్డ్ డెమో ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా వివరించారు. పంటలలో వచ్చే సమస్యలు, ఉత్పత్తుల వినియోగ విధానం, వాటి పనితీరుపై కంపెనీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు.
కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సోఫోన్ తమ సంస్థకు చెందిన నూతన ఫంగిసైడ్ ఉత్పత్తి అని తెలిపారు. వివిధ పంటల్లో దీని వినియోగ అవకాశాలు, లక్ష్య వ్యాధుల నియంత్రణ, పంటలకు అనుకూలత వంటి అంశాలను రైతులకు వివరించారు. ఉత్పత్తులను వినియోగించే సమయంలో లేబుల్‌పై సూచించిన మోతాదులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి దొడ్డిగల్ల బాలాజీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఫీల్డ్ డెమోలు నిర్వహించడం ద్వారా రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలు, ఆధునిక పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన పెరుగుతుందని అన్నారు. పంటల్లో ఉత్పత్తుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఏరియా మేనేజర్ రాఘవ, డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్తిక్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, శివతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.