ఆధార్‌లో పేరు మార్పునకు కొత్త నిబంధనలు..
డాక్యుమెంట్ల ఆధారంగా సవరణలు
Ntoday News: ఆధార్‌లో పేరు మార్పు లేదా సవరణలకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పలు మార్గదర్శకాలను పేర్కొంది. పేరు మార్పు స్వభావాన్ని బట్టి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
పెళ్లి లేదా విడాకుల అనంతరం పేరు, ఇంటిపేరు మార్చుకోవాలనుకునే వారు సంబంధిత అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్‌లో డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లు జరిగిన సందర్భాల్లో సరైన వివరాలను ధ్రువీకరించే పత్రాలను అందజేయాలని సూచించింది.
ఇంగ్లిష్‌లో ఉన్న పేరును స్థానిక భాషలోకి మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అవసరమైన అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అదే విధంగా పూర్తిగా పేరు మార్చుకోవాలనుకునే వారు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
పేరు సవరణల్లో మార్పు స్వల్పంగా ఉందా లేదా పూర్తిగా పేరు మార్పు చేస్తున్నారా అనే అంశాన్ని బట్టి అవసరమైన ఆధారాలు మారుతాయని UIDAI సూచించింది. ఆధార్‌లో వివరాల సవరణకు వెళ్లే ముందు సంబంధిత మార్పుకు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.