సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు విపక్షాల సిద్ధం
పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు న్యాయ నిపుణులతో కలిసి ముసాయిదా సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామానికి ఎన్నికల సంఘంలో చోటుచేసుకున్నట్లు వెలుగులోకి వచ్చిన అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా మారాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో పలు నిర్ణయాలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల సమాచార నిర్వహణతో పాటు ఫామ్-6లో చేసిన మార్పులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఫామ్-6లో కొత్త ఓటర్ల నుంచి అదనపు వివరాలు కోరే మార్పును వారు అనుమతిలేనిదిగా, చట్టబద్ధతపై ప్రశ్నలు ఉన్న చర్యగా పేర్కొన్నట్లు నివేదిక వెలువడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు విపక్ష నేతలు ఆయనను అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ఏడాది మార్చి 12, ఏప్రిల్ 24 తేదీల్లో జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని విపక్షాల నుంచి నోటీసులు వచ్చినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
అయితే విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సంస్థాగత చర్చల్లో సాధారణమేనని, గత ఏడాది తీసుకున్న అన్ని నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.
దీంతో జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాల ప్రతిపాదిత తొలగింపు తీర్మానం, ఎన్నికల సంఘం వివరణల మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది.