పెనుగొలనులో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
పెనుగొలనులో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు నివాళులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను, ఆగస్టు 29:
పెనుగొలను గ్రామంలో పలుచోట్ల తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష అమృతం కన్నా తీయనిదని, తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు మాతృభాషపై అభిమానం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రగతి పాఠశాలలో సందడి
పెనుగొలను ప్రగతి పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవంతో పాటు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి గిడుగు రామమూర్తి, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు తెలుగు కవులు, కవయిత్రుల చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించారు. "అమ్మ భాష తెలుగు", "తెలుగు భాష వర్ధిల్లాలి", "తెలుగు భాష మాట్లాడదాం" అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వీరయ్య, సాయిబాబా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో జయంతి వేడుకలు
పెనుగొలను శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి, భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష గొప్పతనం, క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.