పొగ చూరుతున్న బీడీ కార్మికుల బతుకులు....
పొగ చూరుతున్న బీడీ కార్మికుల బతుకులు.. హామీల పొగలో సంక్షేమం!
ప్రభుత్వ విధానాలు.. యాజమాన్యాల శ్రమదోపిడీతో సంక్షోభంలో లక్షలాది మంది కార్మికులు
బీడీ కార్మికుల జీవితాలు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాల విధానాలు బీడీ పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతుండగా.. మరోవైపు యాజమాన్యాల శ్రమదోపిడీతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, జీవనభృతి పెంపు నిలిచిపోవడం, రిటైర్మెంట్ పెన్షన్ సరిపడా లేకపోవడం, గతంలో అందిన సంక్షేమ సౌకర్యాలు దూరమవడం వంటి సమస్యలు బీడీ కార్మికుల జీవితాలను కుదేలు చేస్తున్నాయి.
తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తామని, ప్రస్తుతం ఉన్న జీవనభృతిని రూ.4,016కు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా.. మూడు బడ్జెట్ సమావేశాలు పూర్తయినా జీవనభృతి పెంపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న ధరలు.. తగ్గుతున్న ఆదాయం
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ బీడీ కార్మికుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. కొత్తగా లక్ష మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, బీడీ కార్మికుల జీవనభృతిని పెంచకపోవడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బీడీ పరిశ్రమలో గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలు ఉన్నప్పటికీ.. తగ్గుతున్న పని దినాలు, ముడిసరుకు సమస్యలు, పరిశ్రమల మూతపడే పరిస్థితులు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కేంద్ర ఆంక్షలతో పరిశ్రమకు గండి
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. బీడీ కట్టలపై ప్రమాద హెచ్చరికల గుర్తులు తప్పనిసరి చేయడం, కంపెనీ పేర్లు స్పష్టంగా కనిపించకుండా నిబంధనలు ఉండటం వల్ల మార్కెట్‌పై ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు.
బీడీ ఆరోగ్యానికి హానికరమని చెబుతూ ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వాలు.. మద్యం, గుట్కా, ఇతర హానికర ఉత్పత్తులపై కూడా సమాన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
జీఎస్టీ భారంతో పరిశ్రమ కుదేలు
బీడీ ముడిసరుకులు, ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల పరిశ్రమపై అదనపు భారం పడుతోందని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీడీ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు అమలు కాకపోవడం, కనీస వేతనాలు అందకపోవడం, కార్మిక చట్టాల్లో మార్పుల వల్ల హక్కులు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు
దశాబ్దాల పాటు అనారోగ్యాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న బీడీ కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత సరైన భరోసా లేకుండా పోయింది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల ధరలతో వృద్ధ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
రిటైర్మెంట్ పెన్షన్‌ను నెలకు కనీసం రూ.10 వేలకు పెంచాలని కార్మికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాల నుంచి స్పందన లేదనే విమర్శలు ఉన్నాయి.
నిలిచిపోయిన సంక్షేమ పథకాలు
గతంలో బీడీ కార్మికుల కోసం సంక్షేమ సెస్ ద్వారా వైద్యం, గృహవసతి, విద్య, తాగునీరు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేవి. బీడీ కార్మికుల పిల్లలకు విద్యా సహాయం, గృహ నిర్మాణ రుణాలు, ఆసుపత్రులు, డిస్పెన్సరీల ద్వారా సేవలు అందేవి.
ప్రస్తుతం ఈ సౌకర్యాలు తగ్గిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
యాజమాన్యాల దోపిడీపై ఆగ్రహం
బీడీ పరిశ్రమకు కార్మికుల శ్రమే ప్రధాన ఆధారం. వేలాది బీడీలు చుట్టి, ప్యాకింగ్ చేసి పరిశ్రమకు ఉత్పత్తి అందిస్తున్న కార్మికులకు మాత్రం సరైన వేతనాలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలు పెంచకపోవడం, తునికాకు, పొగాకు పేరుతో బీడీల సంఖ్యలో కోతలు విధించడం, చెల్లించిన కూలీల్లోనూ కోతలు పెట్టడం వంటి సమస్యలు ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు.
హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం
బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని, పిల్లలకు విద్యా సాయం, గృహ నిర్మాణ సహాయం అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జీవనభృతి పెంపు, కనీస వేతనాలు, రిటైర్మెంట్ పెన్షన్, వైద్యం, విద్య, గృహవసతి వంటి హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.
బీడీ కార్మికుల శ్రమతో పరిశ్రమలు నడుస్తున్నప్పుడు.. వారి జీవితాలు మాత్రం సంక్షోభంలో ఉండటం అన్యాయం. ఈ పరిస్థితులకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాల నిర్లక్ష్యం, యాజమాన్యాల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా సంఘటిత పోరాటమే మార్గమని కార్మికులు పేర్కొంటున్నారు.