దేశవ్యాప్త పాఠ్యపుస్తకాల్లో పైడిమర్రి పేరు చేర్చాలి
ప్రముఖులకు విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయుడు రాం ప్రదీప్
తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావాన్ని పెంపొందించేందుకు దోహదపడే ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞను రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కృషి చేయాలని ఆంగ్ల ఉపాధ్యాయుడు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి ఎం. రాం ప్రదీప్ పలువురు ప్రముఖులను కోరారు. ఆదివారం గుంటూరులో సర్వేపల్లి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు తదితరులను కలిసి పైడిమర్రి వెంకట సుబ్బారావు సేవలను వివరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పైడిమర్రి జీవిత చరిత్ర పుస్తకాలను వారికి అందజేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పైడిమర్రి జీవిత చరిత్ర, దేశానికి ఆయన చేసిన సేవలు తెలియజేసేలా పాఠ్యపుస్తకాల్లో ఆయన పేరుకు తగిన గుర్తింపు కల్పించాలని రాం ప్రదీప్ కోరారు.