పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన
పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు.. ప్రజల సమస్యలపై ఆరా
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో మురుగు కాల్వలు, రోడ్లను పరిశీలిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలోని పల్లెల్లో పారిశుద్ధ్య లోపాలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, రహదారుల పరిస్థితి, పరిసరాల పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగుతాయని తెలిపారు.