ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి : కలెక్టర్ చంద్రశేఖర్
NTODAY NEWS : నల్గొండ,
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా అన్ని స్థాయిల్లో పెండెన్సీని తగ్గించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండల, డివిజన్ స్థాయిల్లో స్థానిక సంస్థలు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా అధికారులు హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11 అంశాలపై సాధించిన లక్ష్యాల నివేదికను ఈ నెల 6లోగా అందజేయాలని సూచించారు. త్వరలో నిర్వహించనున్న ‘దిశ’ సమావేశానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, సీఎం కార్యాలయం, వీఐపీలు, సీఎస్, ప్రజావాణి, సీపీఆర్వో ద్వారా వచ్చిన రిఫరెన్సులపై తీసుకున్న చర్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ నెల పర్యటన వివరాలను వెంటనే సమర్పించాలని, వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారులు స్పందించి తీసుకున్న చర్యలు లేదా వివరణను వెంటనే అందజేయాలని సూచించారు.
* ఆర్టీఐ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
ఈ నెల 5 నుంచి 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్ల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీఐ చట్టం కింద వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా, నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టంపై రూపొందించిన ప్రతిజ్ఞను అధికారులతో కలెక్టర్ చేయించారు.
* పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు త్వరలో ప్రారంభం
కానున్న పత్తి, ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని, వీఎంజీ రాంజీ కింద నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడితే అవసరమైన నీటి వనరులను అద్దెకు తీసుకునేలా చర్యలు చేపట్టాలని, వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 8లోగా పంపించాలని సూచించారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 55, ఇతర శాఖలకు 86 కలిపి మొత్తం 141 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీఆర్వో దశరథ్‌తో పాటు జిల్లా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.