మారు వేషంలో.. సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
మారు వేషంలో.. సామాన్యుడిలా తహసీల్దార్ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం: సామాన్యుడిలా మారు వేషంలో వెళ్లి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. టీషర్ట్, గళ్ల లుంగీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎవరూ గుర్తుపట్టలేని విధంగా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే సుమారు గంటపాటు అక్కడే ఉండి వివిధ పనుల కోసం వచ్చిన ప్రజల పరిస్థితిని గమనించారు. సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కార్యాలయంలో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
స్థల వివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని బుట్టాయగూడెంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మాధవరావు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తన సమస్య పరిష్కారం కావడం లేదని, పలుమార్లు కార్యాలయానికి వచ్చినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, వారిని అనవసరంగా తిప్పుకోవడం సరికాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలకు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆదేశించారు.
మారు వేషంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని తనిఖీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది స్వయంగా తెలుసుకునేందుకే ఈ ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.