ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలి: సర్పంచ్
ఊరుమడ్ల | Ntoday News:
ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని ఊరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం సూచించారు. బుధవారం ఊరుమడ్ల అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా చిరుధాన్యాల్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయని, వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పోషణ మాసం సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. కుటుంబాల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం రిబ్కా, వార్డు సభ్యురాలు సుష్మిత, అంగన్వాడీ టీచర్లు అంజమ్మ, లలిత, ఆశా కార్యకర్త పద్మతో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.