కొండాపూర్ హోటల్‌లో గంజాయి విక్రయాలు.. ఇద్దరి అరెస్ట్
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ / Ntoday News: కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓయూ హైలైట్స్ హోటల్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కేసులో అసోంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25)ను అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన నిందితులు అసోం నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి హోటల్ గదుల నుంచే విక్రయిస్తున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.