జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం
చిట్యాల: జాతీయ రహదారి–65పై చిట్యాల వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు జాప్యం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు గుత్తా వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను గుత్తేదారు నిర్లక్ష్యంగా, నెమ్మదిగా చేపట్టడం వల్ల సర్వీస్ రహదారి వెంట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పెద్దకాపర్తి వద్ద రహదారిపై వాహనాలు ఒక్కసారిగా కిందికి కుదుపునకు గురవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్, సర్వీస్ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు.
వినతిపత్రంపై మంత్రి వెంటనే స్పందించి సంబంధిత గుత్తేదారు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై మండల ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.