స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
మున్సిపాలిటీల వారీగా పార్టీ బలాబలాలపై చర్చ
ధర్మవరం | Ntoday News
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ టీమ్, సపోర్ట్ టీమ్ కమిటీ సభ్యులతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలపై విడివిడిగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల్లో పార్టీకి బలంగా ఉన్న వార్డులు, స్థానిక పరిస్థితులు, పార్టీ శ్రేణుల స్థితిగతులు, ఎన్నికలకు అవసరమైన ఇతర వివరాలను సేకరించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని చిలకం మధుసూదన్ రెడ్డి, టి.సి. వరుణ్ సూచించారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు.
సమావేశంలో కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు ఆకుల ఉమేష్, పత్తి చంద్రశేఖర్, సపోర్ట్ టీమ్ సభ్యులు అడ్డగిరి శ్యామ్ కుమార్, ఇటికోటి క్రాంతి కుమార్, యశ్వంత్, గణేష్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.