ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి CI&SI
తూ, గో జిల్లా
దేవరపల్లి PS13-09-2026
80 వినాయక ఉత్సవ కమిటీలతో దేవరపల్లి పోలీసుల సమన్వయ సమావేశం
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: CI & SI
దేవరపల్లి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో దేవరపల్లి పోలీసుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని 80 వినాయక ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవరపల్లి CI నాగేశ్వర నాయక్ మరియు SI మనోహర్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ అని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ఉత్సవాల నిర్వహణలో కమిటీ నిర్వాహకులు పోలీసు, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ తదితర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. మండపాల ఏర్పాటు, ఉత్సవ కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల విషయంలో అధికారుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఉత్సవాల సమయంలో చిన్నపాటి అపార్థాలు కూడా వివాదాలకు దారితీయకుండా కమిటీ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, యువతను సానుకూల కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
అలాగే, ఉత్సవాల నిర్వహణలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు లేదా అనుమతులకు సంబంధించిన అంశాలు ఎదురైతే ముందుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని అధికారులు సూచించారు.
“భక్తితో పండుగను జరుపుకుందాం – బాధ్యతతో శాంతిభద్రతలను కాపాడుకుందాం” అనే సందేశంతో వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి కమిటీ సహకరించాలని దేవరపల్లి పోలీసులు కోరారు.