అఅత్యుత్సాహం వద్దు.. భక్తితో నిమజ్జనం యువత బాధ్యతగా వ్యవహరించాలి: చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ
చాట్రాయి, సెప్టెంబర్13: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. పండుగ పేరుతో అత్యుత్సాహానికి పాల్పడి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని యువతకు హితవు పలికారు. భక్తి పేరుతో నిబంధనలు ఉల్లంఘించడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం సరికాదని స్పష్టం చేశారు.
నిమజ్జనం సమయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించుకోవడం వంటి చర్యలకు పాల్పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను విషాదంలోకి నెట్టే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు తదితర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరగడం, యువతను ఆకర్షించేందుకు ప్రమాదకరంగా వాహనాలు నడపడం, విన్యాసాలు చేయడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని, పోలీసుశాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
బాణసంచా కాల్చే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై సూచించారు. వింత శబ్దాలు వచ్చే ప్రమాదకరమైన పటాకులను ఉపయోగించకుండా, చిన్నారులు, వృద్ధులు, మహిళలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా బాణసంచా కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
నిమజ్జనం సందర్భంగా రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలను నిలిపివేయడం, గుంపులుగా రోడ్లపై ప్రమాదకరంగా తిరగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. నీటి వనరుల వద్దకు వెళ్లే సమయంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రమాదకర ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలని సూచించారు. పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.
“పండుగ మన ఆనందం కోసం.. కానీ మన ఆనందం వల్ల మరొకరి ప్రశాంతతకు భంగం కలగకూడదు. ఇంటి నుంచి ఆనందంగా బయలుదేరి అదే ఆనందంతో సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలి. ఒక్క క్షణం అత్యుత్సాహం ఒక కుటుంబం జీవితాన్ని మార్చకూడదు” అని రామకృష్ణ పేర్కొన్నారు.
వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాణ్యమైన వైర్లను మాత్రమే ఉపయోగించాలని, వైర్ల జాయింట్ల వద్ద సరైన ఇన్సులేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ తీగలు బహిరంగంగా ఉండకుండా, చిన్నారులు, భక్తులకు ప్రమాదం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వినాయకుడి నిమజ్జనం కేవలం విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదని, మనలోని చెడు ఆలోచనలు, చెడు అలవాట్లను కూడా విడిచిపెట్టడానికి ఇది ఒక మంచి సందర్భంగా భావించాలని ఎస్సై అన్నారు. పండుగ అనంతరం మరింత మంచి మనుషులుగా మారేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరారు.
యువతకు సామాజిక బాధ్యత ఎంతో ముఖ్యమని, నిమజ్జన కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రామకృష్ణ సూచించారు. భక్తి, ఆనందం, ఐక్యతతో పండుగను జరుపుకుంటూనే భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.