తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమకు సిద్ధం: సింగపూర్ ప్రతినిధులు
హైదరాబాద్ / Ntoday News: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన, వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అసెంబ్లీలో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, భవిష్యత్ నగర నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రేవంత్‌రెడ్డి వారికి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటు ఆర్థికపరమైన సహకారం అందించాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం కోరారు.
సమావేశంలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమ ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీని ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్‌ను పర్యాటక కేంద్రంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలిపారు.
ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సింగపూర్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్ జనరల్ విలియం చిక్ తదితర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.