కొండమడుగులో పోషణ్ అభియాన్ మాసోత్సవాలు
కొండమడుగు / Ntoday News: కొండమడుగు గ్రామంలోని నాలుగో అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో పోషణ్ అభియాన్ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అందించే తాజా, వేడి ఆహారం (HCM) ప్రాధాన్యతపై పిల్లల తల్లులు, సంరక్షకులకు అవగాహన కల్పించారు.
పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయని అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, పిల్లలకు సమతుల్య ఆహారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
“నేటి పిల్లలే రేపటి భావితర భారత పౌరులు. పిల్లల ఆరోగ్యమే దేశ పురోగతికి పునాది” అని కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పేర్కొన్నారు. ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందేలా తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు శోభారాణి, రహీమున్నా, అనూష, అమల, ఆశా వర్కర్ సరిత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు.