కాలువలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ప్రాణదానం
కాలువలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ప్రాణదానం గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ చొరవతో వ్యక్తి సురక్షితం
విజయవాడ: విజయవాడ రాఘవయ్య పార్క్ బందర్ లాకుల సమీపంలో కాలువలో కొట్టుకుపోతున్న గుర్తుతెలియని వ్యక్తిని గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ చొరవతో పోలీసులు ప్రాణాలతో రక్షించారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కాలువలో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్నట్లు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందడంతో గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఆయన, ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యక్తిని రక్షించే చర్యలు చేపట్టారు. సీఐ డ్రైవర్ విజయ్, విక్రమ్ ధైర్యంగా కాలువలోకి దిగి తాడు సహాయంతో కొట్టుకుపోతున్న వ్యక్తిని పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
సమయస్ఫూర్తితో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణతో పాటు విజయ్, విక్రమ్‌లను పలువురు అభినందించారు. ప్రమాదకర పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా రక్షణ చర్యల్లో పాల్గొన్న పోలీసుల ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.