కార్మిక హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: ఏఐటీయూసీ నేత బి. దత్తునాయక్
మహేశ్వరంలో జెండావిష్కరణ, సభ.. విద్యార్థులకు పండ్ల పంపిణీ
ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు
మహేశ్వరం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్): ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో జెండావిష్కరణ, సభ, పండ్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. పి. దేవేంద్ర గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దత్తునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దత్తునాయక్ మాట్లాడుతూ.. “రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 1920 అక్టోబర్ 31న లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ప్రారంభమైందని, కార్మికుల హక్కుల కోసం సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన సంఘంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం అవసరం
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన దత్తునాయక్.. భావప్రకటన స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాల హక్కు, సమానత్వం, బహుళ సంస్కృతులు, మతాలు, భాషల పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ద్వారా కార్మిక హక్కులకు విఘాతం కలుగుతోందని, కార్మిక సంఘాలపై ఒత్తిడి పెరుగుతోందని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విషయంలో రైతు, కార్మిక సంఘాల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం, పౌరుల రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడాలని దత్తునాయక్ అన్నారు. విద్యార్థులు, యువత, కార్మికులు ఐక్యంగా నిలిచి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్మగల్ల రాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీశైలం, కోటేష్, యాదగిరి, ప్రవీణ్, సీనియర్ నాయకుడు బ్రహ్మచారి, నాయకులు రవి, అంజయ్య, రాకేష్, బాలరాజు, పప్పు సాంసంగ్ తదితరులు పాల్గొన్నారు.