25 ఏళ్ల పాలనా ప్రస్థానం పూర్తి చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రారంభమైన ఆయన పాలనా ప్రస్థానం 25 ఏళ్లకు చేరింది. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మోదీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లుగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, దేశ పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి లభించిన నమ్మకం, ఆశీర్వాదాలే తనను ముందుకు నడిపించాయని తెలిపారు. దేశానికి సేవ చేయడం అత్యున్నత గౌరవంగా భావిస్తున్నానని, రాజ్యాంగ విలువలను మార్గదర్శకంగా చేసుకుని భవిష్యత్తులోనూ మరింతగా పనిచేస్తానని చెప్పారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. ప్రజల సహకారంతో సవాళ్లను అధిగమించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నాయకులు, ఇతర ప్రముఖులు మోదీకి అభినందనలు తెలిపారు. 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గం కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది.