సీఈసీని తొలగిస్తే 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని ఢిల్లీ వ్యాపారులకు సూచించారు.
నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసనలను వాయిదా వేసుకోవాలని వ్యాపారులు చేసిన విజ్ఞప్తిపై రాహుల్ గాంధీ స్పందించారు. వ్యాపారుల సమస్యలను తాము అర్థం చేసుకుంటున్నామని తెలిపారు. అయితే, ఓటు చోరీ జరిగితే వ్యాపారుల దుకాణాలు, వారి పొదుపు సొమ్ము మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉండదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ తన నిరసనను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.