వంతెన ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీఓ ఏ. కుమార్
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం
గంపలగూడెం: తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో పరిస్థితులను తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్ గురువారం పరిశీలించారు. మండలంలోని కట్టలేరు వంతెన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన వర్షాల ప్రభావం, వాగు ప్రవాహ పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డివిజన్ పరిధిలో వాగులు, వంకలు పొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో గంపలగూడెం తహసీల్దార్ వడ్డేశ్వరపు రాజకుమారి, ఎస్‌ఐ జి. అనిల్, ఆర్‌ఐ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.