కరీంనగర్‌లో వందేమాతరం పూర్తి గేయం ఆలాపన
కరీంనగర్: వందేమాతరం గేయం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి ఉన్నత పాఠశాల, సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల, భాగ్యవతి ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం జాతీయ పూర్తి గేయాన్ని ఆలపించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుడు బూర్గ దక్షిణామూర్తి మాట్లాడుతూ బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులు ఏకకాలంలో గేయాన్ని ఆలపించే కార్యక్రమంలో పాల్గొనడం గర్వించదగిన విషయమన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వందేమాతరం గేయం ఎంతోమంది దేశభక్తుల్లో స్ఫూర్తిని, నూతనోత్సాహాన్ని నింపిందని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వందేమాతరం గేయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ప్రజ్ఞా భారతి సహాయ కార్యదర్శి వెచ్చ మురళి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ప్రతినిధులు, పలువురు ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.