వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
వెలిచేరు: తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వెలిచేరు గ్రామ పరిధిలోని పంట పొలాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మండల క్లస్టర్ ఇన్‌చార్జి ముల్లపూడి భాస్కరరావు ఆదేశాల మేరకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని సమీపంలోని కాలువలోకి మళ్లించే పనులను ప్రారంభించారు.
పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పంటలకు నష్టం కలగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టామని వెలిచేరు పీఏసీఎస్ చైర్మన్ నాగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు మిద్దె గోపాలకృష్ణ గౌడ్, కొండేటి సత్తిబాబు, వద్దిపర్రు పీఏసీఎస్ చైర్మన్, వెలిచేరు హార్టికల్చర్ అధికారి కడలి రేణుక రాఘవి తదితరులు పాల్గొన్నారు.