పైడిపల్లిలో అధ్వానంగా రోడ్లు.. గుంతలతో వాహనదారుల అవస్థలు
పైడిపల్లి | ఎన్ టుడే న్యూస్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో రోడ్లు అధ్వానంగా మారాయి. గ్రామంలోని ప్రధాన రహదారులతో పాటు మూలమలుపుల వద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూలమలుపుల వద్ద రహదారులు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
పాలకులు, అధికారులు మారుతున్నా తమ గ్రామంలోని రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లను పరిశీలించి, గుంతలకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.