వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధుల కలకలం.. సెప్టెంబర్లో 54 డెంగీ కేసులు
వరంగల్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు డెంగీ, సాధారణ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తొమ్మిది నెలల కాలంలో మొత్తం 121 డెంగీ కేసులు, 6,016 సాధారణ జ్వరాలు, 3,604 డయేరియా, 242 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
సెప్టెంబర్ నెలలోనే 54 డెంగీ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కీర్తినగర్, ఎంజీఎం ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధికంగా తొమ్మిదేసి డెంగీ కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వర్షాలు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం దోమల వృద్ధికి అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి ట్యాంకులు, కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు.
జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.