పెనుగొలనులో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
పెనుగొలనులో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడి చిన్నారులకు టవల్స్, అరటి పండ్ల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడి కేంద్రంలో సేవా సంకల్ప్ అభియాన్ మూడోరోజు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్ కే. లింగమ్మ చిన్నారులు, వారి తల్లులతో సమావేశం నిర్వహించి పోషకాహారం, బాలల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ సేవా సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం అంగన్వాడి కేంద్రాలను కేవలం ఆహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా పోషణ, సంరక్షణ, విద్య, బాలల సమగ్ర వికాసానికి వేదికలుగా తీర్చిదిద్దడమేనని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, తల్లిదండ్రుల శ్రద్ధ, అంగన్వాడి సిబ్బంది పర్యవేక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు చిన్నారులకు ప్రథమ గురువులుగా వ్యవహరిస్తారని అన్నారు. చిన్నారుల ప్రాథమిక విద్యా వికాసం, ఆరోగ్యం, సంరక్షణలో అంగన్వాడి సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు అంగన్వాడి చిన్నారులకు టవల్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు, సేవా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.