తుపాను వేళ విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలి.. ఏపీసీపీడీసీఎల్ ఏఈ చాట్రాయి డి. సంజయ్
తుపాను వేళ విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలి.. ఏపీసీపీడీసీఎల్ సూచనలు 1912 హెల్ప్‌లైన్‌కు విద్యుత్ ప్రమాదాల సమాచారం ఇవ్వాలి
చాట్రాయి: మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) చాట్రాయి విద్యుత్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి. సంజయ్ సూచించారు. తుపాను సమయంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కూలిన లేదా గాలికి ఊగిసలాడుతున్న విద్యుత్ తీగల వద్దకు వెళ్లకూడదని, వాటిలో విద్యుత్ ప్రవహించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెగిపడిన తీగలు, కూలిన విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లు, ప్లగ్‌లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను తాకకూడదని సూచించారు. తడిగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలను ఉపయోగించరాదని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ ఉపకేంద్రాలు, మీటర్ బాక్సులకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుపాను సమయంలో అవసరం లేని విద్యుత్ ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్‌లను తొలగించాలని సూచించారు. జనరేటర్లను ఉపయోగించాల్సి వస్తే ఇంటి బయట, గాలి బాగా ప్రసరించే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని, నీటి సమీపంలో లేదా విద్యుత్ తీగల దగ్గర ఉపయోగించరాదని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాలు, తెగిన తీగలు, కూలిన స్తంభాలు లేదా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే ఏపీసీపీడీసీఎల్ హెల్ప్‌లైన్ నంబర్ 1912కు సమాచారం అందించాలని డి. సంజయ్ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని సూచించారు.