అన్నపూర్ణా దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
డొంకేశ్వర్: మండలంలోని అన్నారం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహాశక్తి సేనా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కూరగాయలు, ఆకుకూరల మాలలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు.
అనంతరం భక్తుల కోసం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.