గురుకుల విద్యాలయాల టైం టేబుల్ మార్చాలి
గురుకుల విద్యాలయాల టైం టేబుల్ మార్చాలి ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి: TSUTF
మధిర: మహాత్మ జ్యోతిబాపూలే (MJP), సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి డిమాండ్ చేశారు. మధిర మండలం కృష్ణాపురంలోని MJP, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలను TSUTF మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారు నాగరాజు, ఈ వీరయ్య ఆధ్వర్యంలో సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయుల దీర్ఘకాలిక డిమాండ్‌గా ఉన్న టైం టేబుల్‌ను సవరించాలని కోరారు. MJP, సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు కేర్‌టేకర్లను నియమించాలని కోరారు. NCT, ఆల్ డే డ్యూటీ, క్రాస్ కన్వర్షన్ వంటి సమస్యలను పరిష్కరించాలని, నూతనంగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి ఉద్యమాల నిర్మాణంలో TSUTF ముందుండి పనిచేస్తుందని తెలిపారు. CPS రద్దు, PRC సాధన తదితర సమస్యల పరిష్కారం కోసం నవంబర్‌లో నిర్వహించనున్న పోరాటాల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపారీకరణ విధానాలకు వ్యతిరేకంగా స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI) ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మధిర ప్రాంతీయ కార్యాలయం కోశాధికారి మహమ్మద్ రఫీ, మండల కోశాధికారి బైర్ల చెన్నయ్య, ఎఫ్‌డబ్ల్యూఎస్ కన్వీనర్ మల్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు లంకా నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వూట్ల కొండలరావు, రోకటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.