తిరువూరు పురపాలక సంఘానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు–2026
తిరువూరు: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో **“స్వచ్ఛ మున్సిపాలిటీస్ – జిల్లా స్థాయి అవార్డు”**ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘం అందుకుంది. పట్టణంలో పారిశుధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ అవార్డు లభించింది.
తిరువూరు పట్టణ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేయడం, స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలను పురపాలక సంఘం చేపట్టింది. పురపాలక సంఘం కమీషనర్ కె. మనోజ నాయకత్వంలో అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సమష్టిగా చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా చేతుల మీదుగా కమీషనర్ కె. మనోజ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది కమీషనర్ కె. మనోజకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.