BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమల తరహాలో దివ్యక్షేత్రం అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 08:29 PM
13 వీక్షణలు

వాడపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా: తిరుమల తరహాలో దివ్యక్షేత్రం అభివృద్ధి

ప్రసాద్‌ పథకం ద్వారా కేంద్ర నిధుల కోసం కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

టెంపుల్‌ సిటీగా వాడపల్లి అభివృద్ధికి ప్రణాళికలు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రూ.6.25 కోట్లతో నిర్మించిన వకుళమాత అన్నదాన భవనం ప్రారంభం

వాడపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, ఆగస్టు 30:

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. వాడపల్లి క్షేత్రాన్ని టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రూ.6.25 కోట్ల కామన్‌ గుడ్‌ ఫండ్‌ నిధులతో నిర్మించిన నూతన వకుళమాత అన్నదాన భవనాన్ని ఆదివారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాడపల్లి ఆలయం కోనసీమ ప్రాంతానికే పరిమితమైన క్షేత్రం కాదని, దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఎదుగుతోందన్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

నూతన వకుళమాత అన్నదాన భవనంలో ఒకేసారి 2 వేల నుంచి 2,500 మంది భక్తులు భోజనం చేసే సౌకర్యం ఉందని తెలిపారు. ఆధునిక వంట పరికరాలతో రోజుకు సుమారు 40 వేల మందికి ప్రసాదం సిద్ధం చేసే సామర్థ్యం కల్పించారని చెప్పారు.

వాడపల్లి ఆలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ప్రసాద్‌ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయ అభివృద్ధికి కామన్‌ గుడ్‌ ఫండ్‌, టీటీడీ నుంచి కూడా నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

పెరిగిన ఆలయ ఆదాయం

ప్రస్తుత పాలకమండలి ఆధ్వర్యంలో వాడపల్లి ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో శనివారం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.30 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.కోటికి చేరిందన్నారు. హుండీ ఆదాయం కూడా నెలకు రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పెరిగిందని తెలిపారు.

టెంపుల్‌ సిటీగా వాడపల్లి

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వాడపల్లిని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

రూ.8 కోట్లతో ఏటిగట్టు రహదారి

వాడపల్లి అభివృద్ధిలో భాగంగా భక్తుల రాకపోకలకు అనువుగా ఏటిగట్టు రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సహకారంతో రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

రావులపాలెం నుంచి ఏటిగట్టు మీదుగా వాడపల్లి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రుడా నిధులు రూ.కోటి, పుష్కర నిధులు రూ.కోటి కలిపి మొత్తం రూ.8 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దాతల సహకారంతో ఆధునిక సౌకర్యాలు

వకుళమాత అన్నదాన భవనంలో రూ.1.5 కోట్లతో ఆధునిక వంటశాల, భక్తులు భోజనం చేసేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసిన పశ్చిమగోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సమంతపూడి శ్రీరామరాజు, ఆయన బృందాన్ని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.

వాడపల్లి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఆలయ పాలకమండలి సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.