భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం
వాడపల్లి: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాలు నోము నోచుకుని అష్టోత్తర శతనామ పూజలు, కల్యాణోత్సవం నిర్వహించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
నిత్య అన్నదాన పథకానికి విరాళాలు
ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. వెలగదుర్రుకు చెందిన చేకూరి నాగ సూర్పరాజు కుటుంబ సభ్యులు రూ.1,01,120 విరాళంగా అందించారు. వినగడపకు చెందిన బజారు రమేష్–జ్యోతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,000 విరాళంగా అందజేశారు.
విరాళాలు అందించిన దాతలకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
డిప్యూటీ స్పీకర్ కుటుంబ సభ్యుల దర్శనం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సతీమణి, కుమారుడు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందించారు.
అనంతరం దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.