విజయవాడ: కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. పేరు మాత్రం సస్పెన్స్!
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరును మాత్రం ప్రస్తుతానికి వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగించారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను దశలవారీగా వెల్లడిస్తామని తెలిపారు.
ఇంకా నాలుగు చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. తదుపరి అనంతపురంలో, ఆ తర్వాత విశాఖపట్నం, తిరుపతిలో ప్రెస్‌మీట్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశాల అనంతరం ప్రత్యేకంగా కాంక్లేవ్ నిర్వహించి పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటిస్తామని తెలిపారు.
విజయదశమి తర్వాతి రోజే పార్టీ పూర్తి వివరాలను ప్రకటిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రాంతీయ పార్టీగా ఉంటుందని వెల్లడించారు.
యువతను ప్రధానంగా భాగస్వాములను చేసుకుని కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆయన ప్రకటించారు. యువతకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
ప్రస్తుతం పార్టీ పేరు, జెండా, అజెండా వెల్లడించకపోవడంతో విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విజయదశమి తర్వాతి రోజు జరిగే ప్రకటనతో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.