వరంగల్ లో పడ్డ వర్షం , మురుగు నీరు చేరి రహదారి మినీ చెరువును తలపిస్తోంది.
సైడ్ కాలువల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని స్థానికుల ఆరోపణ
దేశాయిపేట: దేశాయిపేట శాంతినగర్ రోడ్డు నంబర్ 5వ వీధిలో వర్షపు, మురుగు నీరు రోడ్డుపై చేరడంతో రహదారి మినీ చెరువును తలపిస్తోంది. వర్షం కురిసిన ప్రతిసారీ నీరు రోడ్డుపైనే నిలిచిపోతుండటంతో స్థానికులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
సైడ్ కాలువల నిర్మాణ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక రోడ్డుపై నిలిచిపోతుందని పేర్కొన్నారు.
నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, నిలిచిపోయిన సైడ్ కాలువల నిర్మాణ పనులను పూర్తిచేసి వర్షపు, మురుగు నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.