ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం
NTODAY NEWS : నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నియోజకవర్గ స్థాయి సమగ్ర సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించి వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశానికి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యం, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయం, పోలీస్ తదితర శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పటికే మంజూరైన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు అవసరమైన రహదారులను గుర్తించి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన పేదలకు రెండో విడతలో ఇళ్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల వ్యవసాయ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.