తిరుపతి అభివృద్ధికి రూ.3,222 కోట్లతో పనులు
అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్
టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లు
రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులు.. ‘వెంకటాద్రి’ యాప్ ఆవిష్కరణ
తిరుపతి: తిరుపతి–తిరుమల ప్రాంతాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల సమన్వయంతో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను ఆవిష్కరించారు.
అలిపిరి వద్ద సమీకృత యాత్రికుల టౌన్‌షిప్
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్క్ రహదారి వద్ద రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు తదితర సదుపాయాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో పది అంతస్తుల చొప్పున మొత్తం 2,700 గదులను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. రూ.160 కోట్లతో నిర్మించనున్న అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
అలాగే రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే సామర్థ్యంతో బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో కూడిన సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి చరిత్ర, వైభవం, సంప్రదాయాలను పరిచయం చేసే పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తోపాటు ఆధునిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాలకు రూ.230 కోట్లు
శ్రీవారి సేవలో నిరంతరం నిమగ్నమయ్యే టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. పాదిరేడు అరణ్యం వద్ద 418 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గృహ స్థలాల లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.230 కోట్లు వెచ్చించనున్నారు.
తొలి, రెండో దశల్లో మొత్తం 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన గృహ స్థలాల్లో రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి కేంద్రం, విద్యుత్ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు టీటీడీ రూ.150 కోట్లు, ఉద్యోగులు రూ.80 కోట్లు సమకూర్చనున్నారు.
ఈ టౌన్‌షిప్‌ను పర్యావరణహిత నెట్‌జీరో ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉంటే వారు మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించగలరని పేర్కొన్నారు. గృహ స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులు
తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించనున్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనుల్లో తుడా రూ.127 కోట్లతో 16.50 కిలోమీటర్లు, టీటీడీ రూ.115 కోట్లతో 3.60 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నాయి.
ఈ రహదారులు జాతీయ రహదారులు 140, 71 మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించనున్నాయి.
భక్తుల సేవలకు ‘వెంకటాద్రి’ యాప్
భక్తులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. శ్రీవారి ఆలయాలు, అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం, వృక్షగోవిందం, శ్రీవారి సేవ, గోశాల తదితర సేవా కార్యక్రమాలను అనుసంధానిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా యాప్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
తిరుపతిలోని చెరువులను అనుసంధానించి సుందరంగా తీర్చిదిద్దాలని, ఔషధ మొక్కల ప్రాంతాలను ఆధ్యాత్మిక, ప్రకృతి అనుభూతిని అందించే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పర్యాటకం, ఉపాధికి ప్రాధాన్యం
తిరుపతిని వివాహ వేడుకలు, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలకు అనువైన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ హాల్ ఏర్పాటు, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, ఏసీఏ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి ఆధ్యాత్మికతతోపాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సౌకర్యాల విషయంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు ఎ. శరత్, గోపినాథ్, పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ, జి. భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తుడా, టీటీడీ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.