తిరువూరు రచయితలకు అక్షర కిరీటి బిరుదులు
తిరువూరు: భద్రాద్రి కవితా పండుగ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 176వ జాతీయ ద్విశతాధిక కవి సమ్మేళనంలో తిరువూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు రచయితలు ‘అక్షర కిరీటి’ బిరుదులతో ఘనంగా సన్మానించబడ్డారు.
భద్రాచలం సమీపంలోని ఎటపాకలోని డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. కత్తి మండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక అధికార ప్రతినిధి వరలక్ష్మి సాయిరాం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, శ్రీశ్రీ కళావేదిక ప్రణాళిక అధ్యక్షులు డాక్టర్ పార్థసారథి, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంచాక్షరయ్య తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేసిన తిరువూరుకు చెందిన రచయిత్రి ఈడే వెంకట భరత్ కుమారి, ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరుకు చెందిన విశ్వనాథుని శంకరాచారి ప్రతిభను గుర్తించి ‘అక్షర కిరీటి’ బిరుదులతో సత్కరించారు. వారికి మెమెంటో, శాలువా, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అక్షర కిరీటి బిరుదులు అందుకున్న ఈడే వెంకట భరత్ కుమారి, విశ్వనాథుని శంకరాచారికి గంపలగూడెం మండలం పెనుగొలను షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. సాహిత్య రంగంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి గత ఏడాది కూడా షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పెనుగొలను గ్రామంలో ఘనంగా సన్మానించినట్లు కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా రచయితలు, కవులు సాహిత్య రంగంలో మరింతగా సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.