లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం
భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు.. భారీగా పాల్గొన్న గ్రామస్థులు
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, లద్దిగం: లద్దిగం గ్రామంలో గణేష్ చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మంగళ వాయిద్యాలు, డప్పుల నడుమ గ్రామంలో సందడి నెలకొంది.
నిమజ్జనానికి ముందు నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది. గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొనడంతో మండపం వద్ద సందడి వాతావరణం కనిపించింది.
పోటాపోటీగా సాగిన వేలంపాటలో తిర్నుపల్లి గ్రామానికి చెందిన బాబు రెడ్డి–సుజాతమ్మ దంపతులు రూ.61,000లకు గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న అనంతరం భక్తులు, గ్రామస్తులు వారిని అభినందించారు.
లడ్డూ ప్రసాదాన్ని తలపై ఉంచుకుని మంగళ వాయిద్యాల మధ్య ఆనందం వ్యక్తం చేశారు. గణేష్ లడ్డూ ప్రసాదం తమ కుటుంబానికి, గ్రామానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలిగిస్తుందనే విశ్వాసాన్ని భక్తులు వ్యక్తం చేశారు.
అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పుల మోత, మంగళ వాయిద్యాలు, గణేష్ నామస్మరణతో లద్దిగం గ్రామం మార్మోగింది. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన వేడుకలను విజయవంతం చేశారు.