రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు..
రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. రూ.4.40 లక్షలకు లడ్డూల వేలం
పల్నాడు జిల్లా, రొంపిచర్ల: రొంపిచర్ల గ్రామంలో స్థానిక ఒడియ రాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విశేష నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి రోజు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
రూ.4.40 లక్షలకు రెండు లడ్డూల వేలం
ఆరవ రోజు నిర్వహించిన నిమజ్జన మహోత్సవంలో భాగంగా గణపతి లడ్డూ ప్రసాదాల వేలం పాటను ఉత్సాహంగా నిర్వహించారు. భక్తులు వేలంలో పోటీపడి స్వామివారి లడ్డూ ప్రసాదాలను దక్కించుకున్నారు.
మొదటి లడ్డూ వేలం పాటలో బండారు అంకమ్మ రూ.3 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
రెండో లడ్డూ వేలంలో ఒంటిపులి అడివి అన్న కుటుంబ సభ్యులు రూ.1.40 లక్షలకు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
దీంతో రెండు లడ్డూలు కలిపి మొత్తం రూ.4.40 లక్షలకు వేలం జరిగాయి.
లడ్డూ ప్రసాదాలను దక్కించుకున్న బండారు అంకమ్మ, ఒంటిపులి అడివి అన్న కుటుంబ సభ్యులను మండప నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.
కోలాహలంగా శోభాయాత్ర
లడ్డూ వేలం అనంతరం మేళతాళాలు, బాణసంచా మధ్య వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. యువత నృత్యాలతో సందడి చేయగా, గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధల మధ్య వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు..