ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 19, Ntoday న్యూస్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, బత్తలూరు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదై వాతావరణం వేసవిని తలపించిన నేపథ్యంలో వర్షం కురవడంతో రైతుల్లో కొంత ఊరట కనిపించింది.
వారం రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సాగు చేసిన పంటలపై ప్రభావం పడిందని రైతులు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మిరప, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండ వేడికి వాడిపోయి నేలవాలినట్లు పేర్కొన్నారు.
శనివారం రాత్రి కురిసిన వర్షంతో పొలాల్లో తేమ పెరిగి పంటలకు కొంత ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షం కురవడం పంటలకు ప్రాణం పోసినట్లుగా ఉందని రైతులు పేర్కొన్నారు.
ఇక రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసి పంటలకు అవసరమైన తేమ లభిస్తే సాగుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.