సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి సురేష్ మృతి
జర్నలిస్టు సంఘాల సంతాపం
అన్నమయ్య జిల్లా, రామసముద్రం: రామసముద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి సురేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కొండపల్లి సురేష్ తన పాత్రికేయ ప్రస్థానాన్ని ఈనాడు దినపత్రికతో ప్రారంభించారు. రామసముద్రం మండల కేంద్రంలో విలేకరిగా పనిచేసిన ఆయన అనంతరం మదనపల్లె ఈనాడు ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా కూడా చాలా కాలం సేవలందించారు.
తదుపరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు కేంద్రాల్లో జర్నలిస్టుగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో కొనసాగుతూ వివిధ ప్రాంతాల్లో వార్తా సేకరణ, ప్రజా సమస్యలపై కథనాల ప్రచురణలో భాగస్వామ్యమయ్యారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన సురేష్‌ను చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
సురేష్ మృతి పట్ల పలు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురేష్ మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.