మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం.. వృద్ధుడిపై పోక్సో కేసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బుడుగు బజార్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భద్రాచలంలో ఇంటర్ చదువుతున్న బాలిక రామచంద్రాపురం బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా అదే మార్గంలో వెళ్తున్న రాయల కోటయ్య ఆమెను గమనించాడు. ఇంటి వద్ద దింపుతానని చెప్పి బాలికను తన వాహనంపై ఎక్కించుకున్నట్లు తెలిపారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత వాహనాన్ని ఆపి బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక అతడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరినట్లు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కోటయ్య బాలికను బెదిరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే బాలిక భయపడకుండా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కోటయ్య ఇంటికి వెళ్లి అతడిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కోటయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా కోటయ్యపై దాడి చేసిన ఘటనకు సంబంధించి బాలిక బంధువుల్లో 14 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.