India Today Conclave South 2026లో భట్టి విక్రమార్క
India Today Conclave South 2026లో భట్టి విక్రమార్క.. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు
కొచ్చిలోని గ్రాండ్ హయత్‌లో జరిగిన India Today Conclave South 2026 సదస్సులో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. “The Next Chapter: Growth, Governance and Opportunity in Telangana” అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెట్టుబడుల అవకాశాలు, కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఎన్నికల వ్యవస్థ, కాంగ్రెస్ సిద్ధాంతాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థ అని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఉండేలా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఫలితాలు మారే నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తే వాటిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలపై వస్తున్న ఆరోపణలు, SIR ప్రక్రియలో పేర్ల తొలగింపుపై కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటముల కంటే ఎన్నికల ప్రక్రియపై ప్రతి పౌరుడికి విశ్వాసం ఉండటం ముఖ్యమన్నారు. ఓటు ఎవరికి వెళ్తుందనే విషయంలో ప్రజలకు అనుమానం ఉంటే దానిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు.
ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైతే బ్యాలెట్ పేపర్ విధానంపైనా ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు.
హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, తొలి విడతలో సుమారు 4.50 లక్షల ఇళ్లను ప్రారంభించామని, మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేశామని వివరించారు.
అర్హులైన కుటుంబాలకు వైద్య సహాయాన్ని రూ.10 లక్షల వరకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం అందుతోందన్నారు.
సంక్షేమం ఖర్చు కాదు.. మానవ వనరులపై పెట్టుబడి
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేవలం ‘ఫ్రీబీస్’గా చూడటం సరైంది కాదని భట్టి విక్రమార్క అన్నారు. పేదలకు ఇళ్లు, మెరుగైన ఆహారం, విద్య, వైద్యం అందించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. సంక్షేమంపై చేసే ఖర్చు భవిష్యత్తులో రాష్ట్ర ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడిగా చూడాలని వివరించారు.
రైతులకు ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించడం వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సహకారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు తిరిగి వచ్చే వాటాపై పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు.
దేశం రాష్ట్రాల సమాఖ్య అని, కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం ఆరోగ్యకరమైన పరిణామమన్నారు.
పెట్టుబడులకు తెలంగాణలో అనుకూల పరిస్థితులు
తెలంగాణలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి మౌలిక వసతులు రాష్ట్రానికి బలాలని పేర్కొన్నారు.
సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడగలదని తెలిపారు.
వైఎస్సార్ నుంచి కాంగ్రెస్ విలువలు నేర్చుకున్నా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్‌గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాలకు వైఎస్సార్ హాజరై పార్టీ సిద్ధాంతాలు, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర గురించి వివరించేవారని చెప్పారు.
అన్ని మతాలు, వర్గాలను కలుపుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ సిద్ధాంతాల్లో భాగమని వైఎస్సార్ చెప్పేవారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.
కాంగ్రెస్‌ను వీడిన నాయకులు తిరిగి రావాలి
గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను అమలు చేస్తూ అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాల ప్రజలను కలుపుకొని దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని కోరారు.
రేవంత్ రెడ్డితో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పరస్పరం చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణలో ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా తెలంగాణను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.