బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ రాక ఖరారు
సెప్టెంబర్ 12, 13న ఢిల్లీలో సమావేశాలు.. గల్వాన్ తర్వాత తొలిసారి భారత్‌లో జిన్‌పింగ్ పర్యటన
న్యూఢిల్లీ | Ntoday News
ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానున్నారు. జిన్‌పింగ్ భారత్ పర్యటనను చైనా అధికారికంగా ధృవీకరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన న్యూఢిల్లీకి రానున్నారు.
భారత్ 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని చైనా ఇప్పటికే సమర్థించింది. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహిస్తున్న సదస్సు విజయవంతం కావాలని చైనా మద్దతు ప్రకటించింది.
జిన్‌పింగ్ పర్యటనకు ముందు ఆయన హాజరుపై కొంతకాలం స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా చైనా అధికారికంగా ఆయన పర్యటనను ఖరారు చేయడంతో సందిగ్ధతకు తెరపడింది.
మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి
2020 గల్వాన్ ఘర్షణ తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో మోదీ–జిన్‌పింగ్ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో సరిహద్దు పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బ్రిక్స్ సదస్సులో ప్రపంచ పాలన, బహుళపక్ష సహకారం, ఆహార–ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించనున్నారు.
జిన్‌పింగ్ పర్యటనతో భారత్–చైనా సంబంధాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.