కౌలు రైతులకు రుణాలు, పంట నష్టపరిహారం అందేలా చర్యలు
కౌలు రైతులకు రుణాలు, పంట నష్టపరిహారం అందేలా చర్యలు
అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకు ప్రభుత్వ ప్రయోజనాలు అందాలి: ఆర్డీవో ఎ. కుమార్
తిరువూరు: అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలు మంజూరు చేయడంతో పాటు, పంట నష్టం సంభవించినప్పుడు నష్టపరిహారం, పంట బీమా తదితర ప్రభుత్వ ప్రయోజనాలు వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకే అందేలా చర్యలు తీసుకోవాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీవో ఎ. కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐదు మండలాలకు చెందిన కేడీసీసీ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.
కౌలు రైతులకు మంజూరైన సాగు హక్కు కార్డులు ఉన్న రైతులకు బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను, సహకార సంఘాల కార్యదర్శులను ఆర్డీవో సూచించారు. అర్హత ఉన్న కౌలు రైతులు రుణాల కోసం ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
కౌలు రైతు సాగు చేస్తున్న పంటకు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర కారణాలతో నష్టం జరిగినప్పుడు, పంట నష్టాన్ని సక్రమంగా నమోదు చేసి, నష్టపరిహారం కౌలు రైతు పేరుతోనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే పంట బీమా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా వాస్తవంగా పంట సాగు చేస్తున్న కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి అర్హత మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు, పంట నష్టపరిహారం, బీమా తదితర ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.
సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, కేడీసీసీ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.