చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు రేపు ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
53 దీపాలు వెలిగించి ‘బ్లాక్ డే’గా పాటించాలని టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు సెప్టెంబర్ 9తో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించిన ఘటనకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ కార్యాలయాలు, ఇళ్ల వద్ద, బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించాలని సూచించారు. సెప్టెంబర్ 9ను ‘బ్లాక్ డే’గా పాటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ ఈ ప్రకటన చేశారు.
కార్యకర్తల త్యాగాల పునాదులపైనే పార్టీ అధికారం
టీడీపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల పోరాటాలు, త్యాగాలే ప్రధాన కారణమని లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, మంజుల వంటి కార్యకర్తలపై దాడులు జరిగాయని, కొందరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారి త్యాగాలను నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు.
నాయకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి కాంక్లేవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.
నేతలకు ‘త్రీ-పీ’ మంత్రం
నాయకులంతా పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేశ్ సూచించారు.
వ్యక్తిగతంగా ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, మానవత్వం, అణకువతో వ్యవహరించాలని హితవు పలికారు. నాయకులు ఎదిగే కొద్దీ మరింత ఒదిగి ఉండాలని సూచించారు.
విమర్శలను స్వీకరించి, వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకోవాలని నాయకులకు సూచించారు.