చిట్వేలి–రాపూరు ఘాట్‌లో చిరుతల కలకలం..
చిట్వేలి–రాపూరు ఘాట్‌లో చిరుతల కలకలం..! తరచూ రోడ్డుపై ప్రత్యక్షం.. వాహనదారుల్లో భయాందోళన
రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై వెళ్లొద్దంటున్న అటవీశాఖ
తిరుపతి: తిరుపతి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతలు తరచూ కనిపిస్తుండటంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఘాట్ రోడ్డులోని అటవీ ప్రాంతం నుంచి చిరుతలు రహదారి వైపు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
చిరుతలు సంచరించే ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప రాత్రివేళ ఘాట్ రోడ్డులో ప్రయాణించకుండా ఉండాలని సూచించారు.
చిరుతల కదలికలపై అటవీశాఖ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. రహదారిపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే వాటిని వెంబడించడం, దగ్గరకు వెళ్లడం లేదా ఫొటోలు, వీడియోల కోసం ప్రయత్నించడం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.