ద్వారకాతిరుమలలో ఇంట్లో చోరీ కేసు ఛేదింపు
ద్వారకాతిరుమలలో ఇంటి దొంగతనం కేసు ఛేదింపు
ముద్దాయి అరెస్ట్.. 10 గ్రాముల బంగారు చెవి దిద్దులు, ద్విచక్ర వాహనం స్వాధీనం
ద్వారకాతిరుమల: ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబాన్ని గుర్తించి చోరీకి పాల్పడిన వ్యక్తిని ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 10 గ్రాముల బంగారు చెవి దిద్దులతో పాటు నేరానికి ఉపయోగించిన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసాని రామారావు, ఆయన భార్య సెప్టెంబర్ 3న తమ చిన్నల్లుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి ఇంటికి తాళం వేసి పోతినీడిపాలెం గ్రామానికి వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 7న ఉదయం సుమారు 7.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు.
ఆ సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోని బీరువాను కూడా దుండగులు ధ్వంసం చేసి అందులో భద్రపరిచిన ఒక జత బంగారు చెవి దిద్దులు, రూ.50 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. దీంతో బాధితులు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై కలిసి కేసును దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి హేమంత్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుంచి 10 గ్రాముల బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించిన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని కేసులో స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ 4078 ప్రసాద్, కానిస్టేబుళ్లు 1298 చి.లక్ష్మీనారాయణ, 2892 ఎన్.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో ఇంటి దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.